
రబ్బరు తూటాలు ప్రయోగించ లేదు: పోలీసు కమిషనరు
భువనేశ్వర్: బాలాసోర్ విద్యార్థిని ఆత్మాహుతి మృత్యు సంఘటనకు నిరసనగా బిజూ జనతా దళ్ బుధవారం నిర్వహించిన లోక్ సేవా భవన్ ముట్టడి ఆందోళనలో రబ్బరు తూటాల్ని ప్రయోగించ లేదని జంట నగరాల పోలీసు కమిషనరు సురేష్ దేవదత్త సింగ్ తెలిపారు. ఆందోళన కట్టడి చర్యల్లో భాగంగా 5 భాష్ప వాయు సెల్స్, నీటి ఫిరంగుల్ని ప్రయోగించినట్లు వివరించారు. నిరసనకారులు అడ్డుకట్టల్ని అధిగమించడాన్ని నివారించే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆందోళన సమగ్ర దృశ్యాలపై డ్రోన్ నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
‘సీఎం రాజీనామా చేయాలి’
జయపురం: బాలేశ్వర ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యత వహించి సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యామంత్రి, బాలేశ్వర్ ఎంపీలు రాజీనామా చేయాలని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై మంగళవారం పార్టీ శ్రేణులు జయపురం ప్రధాన కూడలి వద్ద ర్యాలీ చేశాయి. కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ విద్యార్థిని సౌమ్యశ్రీ తాను చదివే కళాశాల విభాగ ప్రధాన అధ్యాపకుని ద్వారా లైంగిక దాడికి గురై ఆ విషయం కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం మోహన్ చరణ్, ఉన్నత విద్యామంత్రి, బాలేశ్వర ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా ఫిర్యాదు చేసిందని అయినా ఎవరూ స్పందిచలేదని తెలిపారు. అందుకే కాలేజీ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆ విద్యార్థిని ఏబీవీపీ సభ్యురాలని, అయినా రాష్ట్రపతి పర్యటనకు ఇచ్చిన విలువ ఆ విద్యార్థిని ప్రాణాలకు ఇవ్వలేదని తెలిపారు.
ఉత్కళ ఓంఫెడ్ ఉద్యోగుల ఆందోళన
జయపురం: జయపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల ఓం ఫెడ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాదనకొరకు నిరవధిక పని నిలుపు ఆందోళన చేపట్టారు. రైల్వే స్టేషన్–సేవా పేపరుమిల్లు మార్గంలో గల ఉత్కళ ఓంఫెడ్ పాలపేనెట్ ప్రాసెసింగ్ కర్మాగారం ముందు ఓం ఫెడ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉత్కళ కర్మచారి సంఘం పిలుపు మేరకు జయపురం ఓంఫెడ్ ఉద్యోగులు కార్యాలయం ముందు ధర్నా చేశారు. రెండున్నరేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఓంఫెడ్ సంస్థలో 217 పదవులు ఖాళీగా ఉన్నా వాటిని యాజమాన్యం భర్తీ చేయడం లేదన్నారు.