
అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడుతా..
కొరాపుట్: అవసరమైతే కాంగ్రెస్ పార్టీని విడిచి ప్రజల తరఫున పోరాటం చేస్తానని కొరాపుట్ మాజీ ఎంపీ జయరాం పంగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కొరాపుట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంత కొఠియా సమస్య పరిష్కారంపై ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. తన సొంత పంచాయతీ సమస్యపై తాను మౌనంగా ఉండడం సరికాదన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ కమిటీ చైర్మన్‌గా ఉన్నానన్నారు. కొఠియా సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాన్నారు. అది విఫలం అయితే దండకారణ్య పర్వతమాల వికాస్ పరిషత్ పేరిట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభం అవుతుందన్నారు. దండకారణ్యంలో ఉన్న అవిభక్త కొరాపుట్ జిల్లాలతో పాటు ఆంధ్రాలోని అరుకు ప్రాంతంలోని రెండు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభిస్తున్నామన్నారు. తమకు రాజకీయ పదవులు కొత్త కాదన్నారు. తన మేనమామ మల్లు శాంత రెండు సార్లు, మేనత్త చంద్రమ శాంత ఒకసారి, తన తండ్రి పంగి మసురు శాంత ఒక సారి ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందిన విషయాన్ని జయరాం పంగి గుర్తు చేశారు.
మాజీ ఎంపీ జయరాం పంగి