
రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసులు లేవు
జేఎన్.1 లక్షణాలు
గొంతు నొప్పి
ముక్కు కారటం
దగ్గు
అలసట
తేలికపాటి జ్వరం
● ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా
భువనేశ్వర్: దేశంలో కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ నిఘా ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కొత్త జేఎన్ 1 సబ్‌వేరియంట్ దాఖలాలు లేకున్నా ఆరోగ్య శాఖ అధికారులు బహుళ రోగ పీడితులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ కొత్త కరోనా వైరస్ జాతి కొత్త వేరియంట్ కాదని, ఇప్పటికే చెలామణిలో ఉన్న ఓమిక్రాన్ జాతికి ఉప వంశం అని స్పష్టం చేశారు.
మాస్కు ధారణ మంచిదే
పరిస్థితి తీవ్రమైతే కేంద్ర ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. తదనంతరం రాష్ట్ర ప్రజలకు సముచిత సూచనలు జారీ అవుతాయి. గత వ్యాప్తి మాదిరిగానే, మూత్ర పిండాల వ్యాధి లేదా క్యాన్సర్ వంటి సమస్యాత్మక అనారోగ్యాలు ఉన్నవారు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని ఆయన సూచించారు. తక్షణం భయపడాల్సిన అవసరం లేదని, పాజిటివ్ గుర్తింపు జరిగితే జీనోమ్‌ను సీక్వెన్‌న్స్ కోసం నమూనాలను ఉన్నత నిర్ధారణ పరీక్షలకు సిఫారసు చేసి తగిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ పేర్కొన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం, చేతుల పరిశుభ్రతను పాటించడం, అనవసరమైన ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండడం శ్రేయోదాయకమని హితవు పలికారు.
257 యాక్టివ్ కోవిడ్ –19 కేసులు
ఈ నెల 19 నాటికి మన దేశంలో 257 యాక్టివ్ కోవిడ్ –19 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికం తేలికపాటివే. ప్రస్తుతానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఎటువంటి కొత్త సలహాలు, మారక్గదర్శకాలు జారీ చేయలేదు. సమీప దేశాలలో అంటువ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ముంబైలో ఇటీవల 2 కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించినట్లు సమాచారం. వారిలో మూత్రపిండాల వైఫల్యంతో 14 ఏళ్ల బాలుడు, దీర్ఘకాలంగా 54 ఏళ్ల క్యాన్సర్ పీడితుడు ఉన్నట్లు ఖరారు చేశారు.