
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన చైన్‌స్నాచర్
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గురండి, కాశీనగర్, పర్లాకిమిడి పట్టణంలో జనవరి మాసం నుంచి ఇప్పటివరకూ జరిగిన చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుడు నవీన్ కుమార్ ఎట్టకేలకు ఆదర్శ పోలీసు అధికారుల చేతికి చిక్కాడు. ఈ వివరాలను సోమవారం ఆదర్శపోలీసు స్టేషన్‌లో ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పర్లాకిమిడి, కాశీనగర్, గురండి పోలీసు స్టేషన్ల పరిధిలోని ఏడోమైలు పరిధిలో మొత్తం ఐదు బంగారు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. వృద్ధ మహిళలే టార్గెట్‌గా వారి వెంటనే బైక్‌పై అనుసరించి నిర్జీవ ప్రాంతంలో వారి మెడలోని బంగారు చైన్లను తెంచి పారిపోవడం నవీన్ చాకచక్యంగా చేసేవాడు. నిందితుడు ఉప్పలూరి నవీన్ కుమార్ స్వగ్రామం మందస మండలం (శ్రీకాకుళం) సొండిపూడి గ్రామమని ఎస్పీ పండా తెలియజేశారు. నిందితుడు నవీన్ కుమార్ స్థానిక పెద్ద బ్రాహ్మణవీధిలో కూడా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వస్త్రాల వ్యాపారం కూడా చేసేవాడని తెలియజేశారు. దొంగిలించిన బంగారు వస్తువులను మందస గ్రామంలో తన చెల్లెలు ఇంట్లో దాచేవాడని దర్యాప్తులో తేలిందని అన్నారు. నిందితుడు నవీన్ కుమార్‌పై పర్లాకిమిడి, గురండి పోలీసు స్టేషన్‌లోని
కేసులే కాకుండా మందస, మెళియాపుట్టిలో కూడా ఉండవచ్చని పోలీసు అధికారులు తెలియజేశారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 73.15 గ్రాముల బంగారు వస్తువులు, ఒక చరవాణి, గ్లామర్ బండి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జీఎన్ పండా తెలియజేశారు. అరెస్టయిన నిందితుడ్ని సోమవారం జిల్లా కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసి ప్రశాంత్ భూపతి, గురండి పోలీసు స్టేషన్ అధికారి ఓం నారాయన్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన చైన్‌స్నాచర్