
కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ విస్తరణ
జయపురం: ఇంతవరకు నాలుగు జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ త్వరలో నాలుగు ముక్కలు కానుంది. త్వరలోనే నవరంగపూర్, రాయగడ, మల్కనగిరి జిల్లాలలో స్వతంత్య్ర కేంద్ర సహకార బ్యాంక్‌లు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర సహకార మంత్రాలయం విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఈ విషయం రాష్ట్ర సహకార పరిచాలన కమిటీ డైరెక్టర్ సిద్ధార్థ్ దాస్, కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యనిర్వాహక అధికారికి లేఖ ద్వారా తెలిపారు. 1992లో అవిభక్త కొరాపుట్ నాలుగు జిల్లాలుగా విభజించినా 1950 మార్చ్ 15 వ తేదీన ఏర్పాటు చేసిన కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్)నేటి వరకు కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్‌గానే నాలుగు జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. వాస్తవానికి 1950లో నెలకొల్సిన కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ మొదట నవరంగపూర్‌లో ఏర్పాటు చేశారు. 1972 ఆగస్టు 23న నవరంగపూర్ నుంచి జయపురానికి తరలించారు. కేసీసీ బ్యాంక్ కొరాపుట్, రాయగడ, మల్కన్‌గిరి, నవరంగపూర్‌లలో తన శాఖలను విస్తరించారు. కొరాపుట్ జిల్లాలోని 14 సమితుల్లో 140 పంచాయతీల్లో గల 1944 గ్రామాలలో 10 కేసీసీ బ్యాంక్ శాఖలు 97 ల్యాంపులు నెలకొల్పారు. వాటిలో 1,28,988 మంది సభ్యులు ఉన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న నవరంగపూర్ జిల్లాలో గల ఓ సమితుల్లో 111 గ్రామ పంచాయతీలలో కేసీసీ బ్యాంక్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో నవరంగపూర్, ఉమ్మరకోట్ ప్రజలే కాకుండా 982 గ్రామాల లో 1,07,729 మంది బ్యాంక్ ఖాతాదారులుగా ఉన్నారు. ఈ జిల్లాలో 4 కేసీసీ బ్యాంక్ శాఖలతో పాటు 91 లేంపులు పని చేస్తున్నాయి. అదేవిధంగా మల్కన్‌గిరితో పాటు 1045 గ్రామాలలో కేసీసీ బ్యాంక్ తన సేవలు అందిస్తోంది. ఈ జిల్లాలో గల 4 బ్యాంక్ శాఖలు, 55 లేంపులలో 70,050 మంది ఖాతాదారులు ఉన్నారు. అదేవిధంగా రాయగడ జిల్లాలో రెండు పట్టణాలతో పాటు 2657 గ్రామాల్లో 5 బ్యాంక్ శాఖలు, 95 లేంపులలో 77,258 ఖాతాదారులు సేవలు పొందుతున్నారు. ఆ నాలుగు జిల్లాల బాధ్యతలను కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్, జయపురం నిర్వహిస్తోంది.