
21న డీఈఓ కార్యాలయం ముట్టడి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక మరోసారి పోరుబాటకు సిద్ధమౌతోంది. రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన అసంబద్ధ రీఅపోర్షన్ ఉత్తర్వులు 19, 20, 21లకు వ్యతిరేకంగా రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 21న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డీఈఓ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు బమ్మిడి శ్రీరామ్మూర్తి, మజ్జి మదన్‌మోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఎన్‌జీవో హోంలో ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడగులు వేస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. 9 రకాల పాఠశాలలను తీసుకురావడం వెనుక ఉద్దేశమేంటని.. కనీసం ప్రభుత్వానికై నా తెలుసోలేదా తమకు తెలియడంలేదని ప్రశ్నించారు. అటు విద్యార్థులను, ఇటు ఉపాధ్యాయులను గందరగోళానికి నెడుతున్నారని మండిపడ్డారు. బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను మ్యాన్యువల్‌గా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా చేయడం దారుణమన్నారు. వీటికి నిరసనగా ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈవోల కార్యాలయాల ముట్టడి, 23న పాఠశాల విద్య డైరెక్టర్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎస్.కిషోర్‌కుమార్, గురుగుబెల్లి రమణ, పేడాడ కృష్ణారావు, పిసిని వసంతరావు, బి.రవి, బి.వెంకటేశ్వర్లు, దుప్పల శివరాంప్రసాద్, సత్యనారాయణ భాస్కరరావు, లక్ష్మణరావు, మురళి, ప్రతాప్‌కుమార్, శరత్‌బాబు, మేరీప్రసాద్, రమేష్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.