
బైక్, వ్యాన్ ఢీకొని మహిళ మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్పిల్‌వే సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటననలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సీబిమాన్ ఏరియా లడోలియాంబ్ గ్రామం నుంచి కమలలోఛన్ ఖోరా అతని భార్య హసమాతి ఖోరా ద్విచక్ర వాహనంపై చిత్రకొండ సమీపంలోని ఆలయానికి వెళ్లి తిరుగు వస్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన పికాప్ వ్యాన్ బలంగా ద్వీచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పైనుంచి దంపతులిద్దరూ పడిపోయారు. హసమాతి తలకు బలమైన గాయం తగలడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఐఐసీ ముకుందో మేల్క ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హసమాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లి చనిపోవడంతో వారంతా కన్నీరుమున్నీరుగా రోదించారు.