
యూట్యూబర్ విచారణ
భువనేశ్వర్:
పాకిస్థాన్‌తో రాష్ట్రంలో ఉన్న ఓ యువతికి సంబంధం ఉన్నట్లు ప్రసారం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్సు వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆ యువతిపై నిఘా కేంద్రీకృతం చేశారు. ఆమెతో సహా కుటుంబీకుల్ని దర్యాప్తు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విచారణ నిరవధికంగా కొనసాగుతోంది. ఆ యువతి ఇంటిలోనే దర్యాప్తు వర్గాలు అంచెలంచెలుగా విచారణ చేపడుతున్నాయి. విచారణ తుది నివేదిక ఈ గందరగోళ పరిస్థితిని తేటతెల్లం చేస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్‌కు రహస్య సమాచారం అందిస్తున్నారనే అనుమానంతో హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈమె గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూరీ సందర్శించింది. ఈ సందర్భంగా శ్రీ మందిరం, బీచ్‌తో సహా వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించింది. జ్యోతి మల్హోత్రా పూరీ సందర్శనలో ఆమెకు ప్రియాంక సేనాపతి సహాయం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రియాంక పాకిస్తాన్ వెళ్లిందని కూడా ప్రసారమైంది. ఈ విషయంపై పూరీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రియాంక సేనాపతి పూరీలోని కాళికా దేవి సాహిలో ఉంటుంది. ఈమె యూట్యూబర్ పూరీ సందర్శనలో జ్యోతి మల్హోత్రాకు సహాయం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ఈ వార్త తనను ఉలికిపాటునకు గురి చేసిందని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆమె తెలిపింది.
తండ్రి మాటల్లో ....
ప్రియాంక తండ్రి మాట్లాడుతూ తన కుమార్తెకి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రియాంక యూట్యూబర్‌గా ఉన్నప్పుడు జ్యోతి మల్హోత్రాను కలిసిందని, జ్యోతి పూరీకి వచ్చినప్పుడు, ప్రియాంక సహాయం కోరిందని, జ్యోతి మల్హోత్రా సందర్శనకు ప్రియాంక సహాయం చేసిందని తెలిపారు. ప్రియాంక కూడా వ్లాగ్ కోసం పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లిందని వివరించారు. తన కుమార్తె దర్యాప్తునకు సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తానని, అమాయకులతో పాటు సహకరిస్తానని ప్రియాంక తండ్రి తెలిపారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో తనకున్న సంబంధాన్ని ఒడియా యూట్యూబర్ ప్రియాంక సేనాపతి స్పష్టం చేసింది. సేనాపతికి మల్హోత్రాతో సంబంధం ఉందని నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఆమె బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు మల్హోత్రా యూట్యూబ్ ద్వారా పరిచయం ఉందని, ఈ పరిచయం యూట్యూబ్ కంటెంట్ రూపకల్పనకు మాత్రమే పరిమితం అని అన్నారు. ఆమైపె (జ్యోతి మల్హోత్రా) ఉన్న తీవ్రమైన ఆరోపణల గురించి తనకు తెలియదని, ఆమె శత్రుదేశం కోసం గూఢచర్యం చేస్తుందని తెలిసి ఉంటే సంబంధం కొనసాగించేదాన్ని కాదని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక సేనాపతి ప్రకటించారు. ‘ఏదైనా దర్యాప్తు సంస్థ నన్ను ప్రశ్నించాలనుకుంటే, నేను పూర్తిగా సహకరిస్తాను. దేశానికే మొదటి ప్రాధాన్యత‘ అని ఆమె ముగించారు.
అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు
విచారణకు సహకరిస్తానన్న యూట్యూబర్