
బీజేపీ పాలన వార్షికోత్సవానికి సన్నాహాలు
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి సారిగా భారతీయ జనతా పార్టీ పాలన పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సర్కారు పాలన త్వరలో తొలి ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఈ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. జూన్ 11 నుంచి 13 వరకు వరుసగా 3 రోజులపాటు వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వివిధ పథకాల విజయాలను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రజానీకం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు వేడుకగా నిర్వహించనున్నారు. ఈ విజయాల గురించి ప్రజలకు తెలియజేసి వివిధ విభాగాల్లో అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఈ చొరవ లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమాలకు సంబంధించిన రెండో సన్నాహక సమావేశం ప్రఽభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన స్థానిక ఖారవేల భవన్‌లోని సమావేశం హాల్‌లో జరిగింది. సమావేశంలో అభివృద్ధి కమిషనర్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, సాధారణ పాలన, ప్రజాభియోగాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్, ఇతర సీనియర్ కార్యదర్శులు, కమిషనర్లు మరియు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. లోగడ గత నెల 25న వార్షికోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన రెండో సన్నాహక సమావేశం జరిగింది. ప్రభుత్వం సాధించిన కీలక విజయాలను ప్రదర్శించడం, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం వార్షికోత్సవం లక్ష్యం. స్థానిక జనతా మైదాన్‌లో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా మరియు మండల స్థాయి కార్యకలాపాలు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విజగ గాథలతో ప్రగతి ప్రభ అనే పుస్తకం విడుదల చేస్తుంది.