
వ్యాపారి ఇంటిలో దొంగతనం
జయపురం: నందపూర్ పోలీసు స్టేషన్ పరిధి లమతాపుట్ సమితి పెట్ట గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక వ్యాపారి ఇంటిలో దొంగతనం జరిగింది. ఆ ఇంటిలో రూ.50 వేలు నగదు తో పాటు లక్షల విలువైన బంగారు నగలు, 2 మొబైల్ ఫోన్లు దొంగిలించారు. దీనిపై బాధితుడు నందపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేందుకు ఒక టీమ్‌ను నియమించారు. వ్యాపారి డొంబురు గతన్ తన ఫిర్యాదులో రాత్రి ఒంటి గంటన్నర సమయంలో తన కిరాణా షాపునకు కొంత మంది దుండగులు ముఖాలు కప్పుకొని వచ్చి సీసీ కెమెరాలు కప్పివేశారని తెలిపారు. అనంతరం ఐదుగురికి పైగా ఉన్న దుండగులు మారణాయుధాలతో ఇంటి వద్దకు వచ్చి ముందు తలుపు విరిచి లోపల ప్రవేశించారని తెలిపారు. తనను బెదిరించి డబ్బు, బంగారం, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లిపోయారని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సైంటిఫిక్ టీమ్‌తో వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుని రెండు పోలీసు టీమ్‌లతో దర్యాప్తు జరిపిస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.