
అపార్ట్‌మెంట్ నిర్మాణంపై జేసీకి ఫిర్యాదు
నరసన్నపేట: స్థానిక ఇందిరానగర్‌లో కో–ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణ పనులు గురించి జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ దృష్టికి పంచాయతీ సర్పంచ్ బి.శంకర్, వార్డు సభ్యులు కేసీహెచ్‌బీ గుప్త, బీఎల్ శర్మ, ఆర్.శ్రీధర్‌లు తీసుకెళ్లారు. శనివారం జేసీ నర సన్నపేట పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ నిర్మాణ పనులకు అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా పనులు జరుగుతున్నాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయనకు తెలియజేశారు. సుడా షార్ట్‌ఫాల్‌లో పెట్టి స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. దీనికి జేసీ స్పందించి వెంటనే సుడా అధికారులకు తన మొబైల్ నుంచి మెసేజ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మరోపక్క సుడా ఇచ్చిన స్టాప్ ఆర్డర్ ప్రకారం పనులు నిలిపివేయాల్సింది పంచాయతీ ఈవోనే అని సుడా అధికారులు అంటున్నారు. ఈ మేరకు ప్రత్యేక జీవో ఉందని చెబుతున్నారు. అలాగే మరో వార్డు సభ్యుడు బోయిన సతీష్, స్థానిక నాయకులు తాలాభక్తుల గోవిందరావు, రామకృష్ణలు హోల్డ్‌లో ఉన్న బొరిగివలస రెవెన్యూ పరిధిలోని 18/1 సర్వే నంబర్‌ను సరిచేయాలని కోరారు. దీనివలన నరసన్నపేటలో 13 వీధులకు చెందిన ప్రజలు క్రయవిక్రయాలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే స్థానిక లెపర్సీ కాలనీలో మంచినీటి సమస్య ఉందని భాగ్యం, లక్ష్మిలు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈవోకు ఆదేశించారు.