
గజరాజుల హల్‌చల్
● నియమగిరి అడవుల్లో 27 ఏనుగుల సంచారం ● బిక్కుబిక్కుమంటున్న పరిసర గ్రామాల ప్రజలు
రాయగడ : నియమగిరి పర్వత ప్రాంతంలోని అడవుల్లో ఏనుగులు హల్‌చల్ సృష్టిస్తున్నాయి. ఎప్పుడు గ్రామాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తాయో తెలియక పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధిలోని నియమగిరి పర్వత ప్రాంతాలైన సింగారి, పార్శాలి, సునాఖండి, పొలమ, ఖరొజొడ, కరంజి, టిటిమస్కా, గుమ్మ, లంబ, తొట, లేఖాపొదొరొ, డంగిమట్టి, పొట్టంగిపొదొరొ, చాటికొన గ్రామాలు ఉన్నాయి. వీరంతా డొంగిరియా తెగకు చెందిన ఆదిమజాతి ప్రజలే. రెండు రొజులుగా కలహండి అటవీ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 27 ఏనుగుల గుంపు ఇక్కడ సంచరిస్తున్నాయి. గ్రామాల పరిధిలోని మామిడి, పనస, అరటి వంటి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. రాత్రివేళల్లో చొరబడి తెల్లవారే సరికి సమీప అడవుల్లోకి వెళ్లిపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్నిసార్లు తాగునీటికోసం గ్రామాల్లొకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయని వాపోతున్నారు.
రంగంలోకి ప్రత్యేక దళం..
నియమగిరి అడవుల్లో ఏనుగుల సంచారం సమాచారం అందుకున్న కళ్యాణసింగుపూర్ అటవీ రేంజ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు రేంజర్ చందన్ గొమాంగొ తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక దళం పరిశీలన చేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఏనుగుల వల్ల ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినా, పంట నష్టం మాత్రం ఎక్కువగానే ఉందని గుర్తించామన్నారు. వేసవి తీవ్రతకు తాగునీటిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి చేరుకుంటున్నాయని, త్వరలోనే వీటిని అడవుల్లోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

గజరాజుల హల్‌చల్

గజరాజుల హల్‌చల్