
చోరీ సొత్తు స్వాధీనం
ఎచ్చెర్ల: లావేరు మండలం పెద్దకొత్తకోట ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లో ఈ నెల 3న చోరీకి గురైన 2 తులాల 3 గ్రాముల బంగారం వస్తువులు, ఇత్తడి వస్తువులను రికవరీ చేసినట్లు జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. అదపాక గ్రామానికి చెందిన ముద్దాయి పిన్నింటి చంద్రరావు (పోలారావు) పాత కుంకాం గ్రామంలో మామిడితోటలో కాపలాగా ఉండేవాడు. తోడల్లుడు, మరో వ్యక్తితో కలిసి ఈ నెల 3న పెద్దకొత్తకోట గ్రామానికి వెళ్లి దొంగతనం చేశారు. డీఎస్పీ వివేకానంద ఆదేశాల మేరకు సీఐ అవతారం, లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు, సిబ్బంది రంగంలోకి దిగి క్లూస్‌టీం ఇచ్చిన సమాచారంతో చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రరావు వద్ద ఇత్తడి సామాన్లు, అతని భార్య, మరదలు వద్ద బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చంద్రరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అదపాకలో పాత నేరస్తులు చాలా మంది నేరాలు చేయడం మానేసి కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారని, కానీ కొందరు తిరిగి నేరాలు చేయడం ప్రారంభించారని చెప్పారు. దీనివల్ల గ్రామానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇలాంటి వ్యవహారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయనతో పాటు లావేరు ఎస్సై జి.లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.