
ఆర్థిక సాయం అందజేత
రాయగడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్‌లోచన్ పండ కుటుంబానికి రాయగడ ప్రెస్ యూనియన్ ఆర్థిక సాయం అందించింది. ప్రెస్ యూనియన్ అధ్యక్షుడు అమూల్య రత్న సాహు, కార్యదర్శి శివాజీదాస్, యూనియన్ ముఖ్య సలహాదారుడు సురేష్ దాస్‌లతో పాటు సభ్యులు శుక్రవారం అతని స్వగ్రామం ఖిలింగిలో కుటుంబ సభ్యులను కలిసి రూ.40 వేలు అందజేశారు. ఈ సందర్భంగా పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఆక్రమణలు తొలగింపు
రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు శ్రీకారం చుట్టారు. సమితి కార్యాలయానికి అనుకొని ఉన్న సుమారు 20 దుకాణాలను అధికారులు తొలగించారు. మునిగుడ తహసీల్దార్ ఎం.అనురాధ ఆదేశానుసారం అదనపు తహసీల్దార్ సుభేందు సాహు పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు మధ్య ఈ తొలగింపు కార్యక్రమం శుక్రవారం చేపట్టారు. అయితే గత కొనేళ్లుగా ఇక్కడ చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వ్యాపారులు తమకు వేరే ప్రాంతంలో స్థలం కేటాయించాలని కోరారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా వీరు తీసుకెళ్లారు. అయితే సమితి కార్యాలయంతో పాటు సమీపంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఎదురుగా ఉన్న ఈ దుకాణాలను తొలగించాలని ఇదివరకే వ్యాపారస్తులకు ముందస్తు నోటీసులు జారీ చేసినప్పటికీ, అందుకు స్పందించకపోవడంతో ఈ తొలగింపు కార్యక్రమం అనివార్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
నాటుసారా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
జయపురం: నాటు సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు జయపురం అబ్కారిశాఖ అధికారి హిరన్ సుబ్రత్ శుక్రవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి గొడొపొదర్ గ్రామానికి చెందిన భాస్కర హరిజన్, పాత్రోపుట్ వాసి ఘాశీ గొలారిలుగా గుర్తించామన్నారు. తెలిగుడ, పాత్రోపుట్ గ్రామాల్లో దాడులు నిర్వహించగా 21 లీటర్ల సారాతో ఇద్దరూ పట్టుబడినట్టు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.
మైనర్‌పై లైంగిక దాడి కేసులో
నిందితుడి అరెస్టు
జయపురం: బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాష చంద్రరౌత్ శుక్రవారం వెల్లడించారు. అరెస్టు అయిన వ్యక్తి కొరాపుట్ నాయిక కాలనీ నివాసి సునీల్ ఖొరగా వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపినట్లు చెప్పారు. బాధితురాలైన బాలికను శిశు సురక్షా కమిటీ ముందు హాజరు పరుస్తామని చెప్పారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం జయపురం పట్టణం మైనర్ బాలిక గత ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంభ సభ్యులు బయపడ్డారు. వారు అన్ని చోట్ల వెతికినా బాలిక జాడ తెలియక పోవటంతో లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లభించిన ఆధారాల మేరకు మైనర్ బాలికను కనుగొన్నారు. సునీల్ బాలికను అపహరించి అత్యాచారం జరిపినట్లు గుర్తించారు.

ఆర్థిక సాయం అందజేత