
అకాల వర్షాలకు ‘రాష్ట్ర నిర్దిష్ట విపత్తు’ గుర్తింపు
● 10 శాతం ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు కేటాయింపు
భువనేశ్వర్: ఏటా ప్రకృతి విపత్తులతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటుంది. ప్రధానంగా రైతుల వెతలు వర్ణనాతీతం. ఈ విపత్కర వాతావరణ పరిస్థితి ప్రభావాన్ని విపత్తుగా గుర్తించి విపత్తు స్పందన సహాయం ప్రకటించాలని బాధిత వర్గం దీర్ఘ కాలంగా అభ్యర్థిస్తోంది. వీరి అభ్యర్థనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇది రైతులకు కొంత మేరకు ఊరట కలిగించింది. తరచుగా విస్తృతమైన పంట నష్టాన్ని కలిగించే అకాల వర్షాన్ని రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆమోదించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అకాల వర్షాల కారణంగా పంటలకు జరిగిన నష్టానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్ డీఆర్‌ఎఫ్) నుంచి సహాయం పొందగలుగుతారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ వార్షిక కేటాయింపులో గరిష్టంగా 10 శాతం వరకు నిధుల్ని అకాల వర్షాల నష్ట పరిహారంగా చెల్లించేందుకు అనుమతించడం విశేషం.
గత ఏడాది డిసెంబర్ నెలలో అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో 22 వేల 791 హెక్టార్ల విస్తీర్ణపు పొలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. ఈ విపత్తుకు 6 లక్షల 66 వేలకు పైగా రైతులు ప్రభావితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని తాత్కాలికంగా ప్రత్యేక రాష్ట్ర విపత్తుగా ప్రకటించి పీడిత వర్గానికి ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో రైతులకు సాగు పెట్టుబడి సబ్సిడీ రూపంలో రూ. 291 కోట్ల సహాయం అందజేసి ఆదుకుంది. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో అకాల వర్షాలను శాశ్వతంగా రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు. దీని కోసం రైతులకు ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి సహాయం అందుతుందని అభయం ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది విపత్తులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తులుగా గుర్తించింది. వాటిలో పిడుగుపాటు, వడగాడ్పులు, సుడి గాలులు, భారీ వర్షం, పడవ ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, పాము కాట్లు చోటు చేసుకున్నాయి. అకాల వర్షాన్ని ఈ జాబితాలో చేర్చడంతో రాష్ట్ర నిర్దిష్ట విపత్తుల సంఖ్య 9కి పెరిగింది. రాష్ట్రాన్ని ప్రభావితం చేసే తుఫానులు, కరువులు, భూకంపాలు, వరదలు వంటి ప్రముఖ జాతీయ విపత్తులు కేంద్ర ఆమోదం పొందిన విపత్తుల జాబితాలో కొనసాగుతున్నాయి. ఆ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో ప్రభావిత వర్గాలకు సముచిత సహాయ సహకారాలు అందుతున్నాయి.