
ప్రభుత్వానికి, ప్రజలకు అధికారులే వారధులు
భువనేశ్వర్: మండలాలు ప్రభుత్వ పాలన సాఫల్యత ప్రతిబింబింప జేసే అద్దాలని, ప్రజలు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందడం ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనం అవుతుందని సీఎం మోహన్ చరణ్ మాఝి అన్నారు. గురువారం స్థానిక లోక్ సేవా భవనన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రముఖ అభివృద్ధి అధికారులు (సీడీఓ), మండల అభివృద్ధి అధికారులు (బీడీఓ) సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేయడంపైనే ప్రభుత్వ విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. అన్ని అభివృద్ధి పనులు ప్రజలకు అక్కరకు దోహదపడితే మండల, జిల్లా స్థాయి పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. ఈ దిశలో సీడీఓ, బీడీఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు ముఖ్యమైన పాత్రధారులని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా మేజిస్ట్రేట్ మినహా మండల స్థాయిలో ప్రముఖ అభివృద్ధి అధికారులు, మండల అభివృద్ధి అధికారులు ప్రధాన బాధ్యతను నిర్వహించడం అనివార్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రణాళికలు ప్రజల కోసమేనని, అధికారులు, సిబ్బంది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి వంటి వారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ముఖ్య సేవకుడిగా భావించి ప్రజాసేవకు కృషి చేస్తున్నట్లు అధికారుల్ని ప్రోత్సహించారు. అవినీతి లేదా నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ తాగునీటి శాఖ మంత్రి రవి నారాయణ్ నాయక్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలు గ్రామాల అభివృద్ధి లేకుండా దేశం అభివృద్ధి చెందదని ప్రబోధించారని అన్నారు. బాపూజీ దార్శనికత ఆధారంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.. ప్రభుత్వ ప్రణాళికలను ప్రజలకు సరిగ్గా చేరదీసి కొత్త ప్రభుత్వ పాలన విధానం దృక్పథం మరియు బాధ్యతాయుత భావానికి సీడీఓ, బీడీఓలు సారథ్యం వహించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, పంచాయతీరాజ్ మరియు తాగు నీటి శాఖ కమిషనర్ మరియు కార్యదర్శి గిరీష్ ఎస్‌ఎన్, తాగునీరు, పారిశుధ్య శాఖ డైరెక్టర్ వినీత్ భరద్వాజ్, 30 జిల్లాల ముఖ్య అభివృద్ధి, 314 మండలాల అభివృద్ధి సమావేశంలో పాల్గొన్నారు.