
రోడ్డు ప్రమాదాల నివారణపై చర్యలు
రయగడ: రోడ్డు ప్రమాదాల నివారణపై బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్రనాయక్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని కలెక్టర్ సమావేశం హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఆర్టీఓ శివశంకర్ చౌదరి, రాయగడ సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, గుణుపూర్ సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై సంబంధిత అధికారుల దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రధాన రహదారుల్లో ప్రమాద నివారణ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా రేడియం లైట్లు, తదితరమైనవి అత్యవసరంగా ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక బాకురు గుడ వద్ద గల నాగావళి ప్లానిటోరియం సమీపంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణం
లోని ప్రధాన ప్రాంతాలతోపాటు షాపింగ్ మాల్‌ల వద్ద ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తరచూ తనిఖీలు.
ట్రాఫిక్ బంధనలు ఉల్లఘించిన వారిపై కొరఢా ఝలిపిస్తున్నామని ఆర్టీఓ శివశంకర్ చౌదరి అన్నారు. ఈ ఏడాది ఏప్రెల్ నాటికి అతివేగంగా వాహనాలు నడిపే 15 మందిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే 965 మందికి జరిమానా విధించి వారి వద్ద రూ.9.65 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపే 294 మందిని గుర్తించి వారి నుంచి రూ. 3.2 లక్షలు జరిమానాను విధించామని వివరించారు. ఇతరత్ర నియమాలు ఉల్లంఘించిన మరో 233 మంది వద్ద రూ.1.81 లక్షలను వసూలు చేశామన్నారు.