
‘జగన్నాథ దామా’ పేరు పెట్టడం తగదు
జయపురం: పశ్చిమబెంగాల్‌లోని దిగాలో నిర్మించిన జగన్నాథ్ మందిరానికి జగన్నాథ్ దామా అని పేరు పెట్టడాన్ని ఉత్కళ సమ్మిళిని కొరాపుట్ జిల్లాశాఖ తీవ్రంగా వ్యరేకించింది. గురువారం జయపురం ఉత్కళ సమ్మిళిని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బినోద్ మహపాత్రో మాట్లాడారు. హిందూ, సనాతన ధర్మం ప్రధాన గురువు ఆదిశంకరాచార్యుల సమయంలో దేశంలో నాలుగు దామాలు ఉండేవన్నారు. వాటిలో ఒకటైన పూరీ జగన్నాథ్ దామం ప్రసిద్ధి చెందిందని వెల్లడించారు. దిగాలో నిర్మించిన జగన్నాథ మందిరానికి జగన్నాథ్ దామా అని నామకరణం చేయటం తగదన్నారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ జగన్నాథ క్షేత్రం ఒక విశ్వాసం, ఒక ధర్మ పీఠమన్నారు. ప్రపంచంలో అన్ని చోట్లా జగన్నాథ మందిరాలు నెలకొల్పారని, మందిర ప్రతిష్టపై ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని దిగాలో నిర్మించిన జగన్నాథ మందిరానికి జగన్నాధ్ దామం అని పేరు పెట్టడం మంచిది కాదన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మోహణ చరణ మఝి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరవింద పాడీ, పూరీ గజపతికి లిఖత పూర్వకంగా తెలియజేయటాన్ని ఉత్కళ సమ్మిళిని స్వాగతిస్తుందని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి వెంటనే కలుగుజేసుకొని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉత్కళ సమ్మిళిని జిల్లా అధ్యక్షుడు మదన మోహన్ నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పరమేశ్వర పాత్రో పాల్గొన్నారు.