
తవ్వేస్తున్నారు!
దర్జాగా..
● గోవిందపురం కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలింపు ● అనుమతులు లేకపోయినా టిప్పర్ల ద్వారా రవాణా ● ఇదేంటని ప్రశ్నించిన సర్పంచ్‌పై దురుసు ప్రవర్తన
సంతబొమ్మాళి: మండలంలోని గోవిందపురం సర్వే నెంబర్ 71లో కొండపై గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా దౌర్జన్యంగా టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. లక్షల రూపాయలను సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తరలింపుపై ప్రశ్నించిన స్థానిక సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు నిర్వాహకులు విశ్వసముద్రం సంస్థ ద్వారా మూలపేట పోర్టు పనులకు గ్రావెల్‌ను తరలిస్తున్నామని చెబుతున్నారు. ఆర్డర్ కాపీ చూపించాలని కోరగా..ఆర్డీవో వద్దకు వెళ్లి అడగండంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి సర్వే నెంబర్ 71లో ఉన్న ఈ కొండను గ్రామానికి చెందిన మండపాక నర్సింగరావు 2020–30 సంవత్సరం వరకు లీజుకు తీసుకున్నారు. ఏటా హెక్టార్‌కు రూ.65వేలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్లు లీజుదారు చెబుతున్నారు. తనకు లీజుకిచ్చిన గ్రావెల్ కొండను ఇతరులు తరలించుకుపోతున్నారని జిల్లా మైన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు మంగళవారం ఏడీ అశోక్ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ టిప్పర్లను సీజ్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. సీజ్ చేసిన గంటలోపే మళ్లీ గ్రావెల్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభం కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ గ్రావెల్‌ను తరలించుకుపోవడంపై విమర్శఽలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
న్యాయపోరాటం తప్పదు..
కింజరాపు కుటుంబీకుల కనుసన్నల్లోనే గ్రావెల్‌ను ఎటువంటి అనుమతులు లేకుండా తరలించుకుపోతున్నారు. లీజుదారుడైన నన్ను సంప్రదించకుండా దౌర్జన్యంగా గ్రావెల్ తీసుకెళ్తున్నారు. జిల్లా మెన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాను.
– మండపాక నర్సింగరావు,
లీజుదారుడు, వల్లేవలస
దురుసుగా సమాధానం..
అక్రమంగా గ్రావెల్ తరలించుకుపోవడంతో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాను. మీకు ఎటువంటి అనుమతులు ఉన్నాయో పత్రాలు చూపించండని కోరాం. ఆర్డీవో దగ్గర పర్మిషన్ ఆర్డర్ ఉంది వెళ్లి చూసుకోండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు.
– ఆర్.రామిరెడ్డి,
సర్పంచ్, గోవిందపురం

తవ్వేస్తున్నారు!