
నరేంద్ర పుష్కరిణిలో యువకుడు మృతి
భువనేశ్వర్: పూరీలోని పవిత్ర నరేంద్ర పుష్కరిణిలో బుధవారం మధ్యాహ్నం విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నానం చేస్తుండగా ఒక యువకుడు మునిగిపోయాడు. అతని వివరా లు తెలియాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ యువకుడు వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం స్నానం చేయడానికి పుష్క రిణిలోకి దిగాడు. తిరిగి ఒడ్డుకు చేరుకోలేక సతమతం అయ్యాడు. ఈ విషయం స్థానికులు అగ్నిమాపక దళానికి తెలియజేశారు. వారు పుష్కరిణిలో గాలింపు చర్య నిర్వహించి నీట మునిగిన యువకుడిని ఒడ్డుకు చేర్చారు. తక్షణ మే పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని తీసుకుని వచ్చినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. గతేడాది ఇలాంటి రెండు సంఘటనలు నమోదు అయ్యాయి.
ఆకాశవాణి ఏ–గ్రేడ్ ఆర్టిస్ట్‌గా సత్యవరప్రసాద్
కవిటి: బెనారస్ హిందూ యూనివర్సిటీలో మృదంగం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బొంతలకోటి సత్యవరప్రసాద్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇటీవల నిర్వహించిన ఆడిషన్‌లో ఏ–గ్రేడ్ ఆర్టిస్ట్‌గా అర్హత సాధించారు. ఈ మేరకు హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయని సత్యవరప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం కవిటి మండలం కుసుంపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
నారాయణపురం ఆయకట్టుకు నిధులు మంజూరు
ఎచ్చెర్ల క్యాంపస్: ఖరీఫ్‌లో సాగునీటి సమస్య పరిష్కారానికి నారాయణపురం ఆయకట్టుకు రూ.34.63 లక్షల నిధులను జలవనరులు శాఖ అధికారులు మంజూరు చేశారు. జంగిల్ క్లియరెన్స్, ఇసుక పొరల తొలగింపు, షట్టర్లు, మదుముల మరమ్మతులకు ఈ నిధులు వినియోగిస్తారు. సజావుగా సాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇసుక వాహనాలు సీజ్
కొత్తూరు: మండలంలోని అంగూరు ఇసుక ర్యాంపు(ఆకులతంపర) వద్ద బుధవారం జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నట్లు తహశీల్దార్ కె.బాలకృష్ణ తెలిపారు. నది మధ్యలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రొక్లెయిన్, జేసీబీ, లారీలు, ట్రిప్పర్లు మొత్తం ఆరు వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు.
ఉపాధి వేతనదారుడికి పాముకాటు
మెళియాపుట్టి: మండలంలోని చాపర పంచాయతీలో పరిధిలో బుధవారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా డోల అప్పడు అనే 60 ఏళ్ల వృద్ధుడు పాముకాటుకు గురయ్యాడు. వెంటనే తోటి వేతనదారులు ఫీల్డ్ అసిస్టెంట్ సింహాచలంకు తెలియజేయడంతో హుటాహుటిన పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
కాశీబుగ్గ/ఇచ్ఛాపురం : ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లారోడ్డు రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జి.ఆర్.పి. పోలీసుస్టేషన్ ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్ తెలిపారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇచ్చాపురం–సుర్లారోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య ఎగువ లైనులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. మృతుడి వయసు 55–60 ఏళ్లు ఉండవచ్చని, కాషాయ రంగు టీషర్టు, ఆకుపచ్చ లుంగీ ధరించి ఉన్నాడని, చేతి కర్ర, సంచి ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 9440627567 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.
55 పశువులు పట్టివేత
రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలో రామతీర్థాలు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఐదు బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 55 పశువులను జె.ఆర్.పురం పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల నుంచి విశాఖపట్నం గోవధశాలకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. పశువులను విజయనగరం జిల్లా గుజ్జంగివలసలోని గో–సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.

నరేంద్ర పుష్కరిణిలో యువకుడు మృతి

నరేంద్ర పుష్కరిణిలో యువకుడు మృతి