
ఎక్కడి వాహనాలు అక్కడే..
● కొత్తరోడ్డు–నందగిరిపేట మధ్య ట్రాఫిక్ జామ్
● వందల సంఖ్యలో నిలిచిన వాహనాలు
● ఎండలో ప్రజల నరకయాతన
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన శ్రీకాకుళం–పాలకొండ–పార్వతీపురం రహదారి బుధవారం స్తంభించిపోయింది. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వరకు నాలుగు లైన్ల రోడ్లుగా ఇటీవల అభివృద్ధి చెందుతున్న ఈ రహదారిలో పలుచోట్ల కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. ఇదే క్రమంలో ఆయా గ్రామాల పరిధిలో అమ్మవార్ల పండగలు బుధవారం జరగడంతో భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా కొత్త రోడ్డు సమీపంలోని చర్చి వద్ద ఉన్న ప్రధాన కాలువ కల్వర్టు పనులు కొన్నాళ్లుగా నిలిచిపోవడంతో ఇక్కడ నిత్యం వాహనాలు నిలిచిపోతున్నాయి. రాయిపాడు జంక్షన్ వద్ద కల్వర్టు ఒకవైపు తవ్వకాలు జరపటం చర్చి వద్ద ఉన్న కల్వర్టు ప్రాంత పక్క రహదారిని మూసివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదే రహదారి సమీపంలో ఆమదాలవలస మండలం వంజంగి, గట్టుముడిపేట గ్రామాల్లో అమ్మవారి పండుగలు నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో జనం తరలివచ్చారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి కొత్త రోడ్డు ప్రాంతం నుంచి నందగిరిపేట వరకు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. బస్సులు, లారీలు, కార్లలో గంటల తరబడి ఉండిపోయారు. ఆసుపత్రులకు రోగులను తరలించే అంబులెను్‌ుస్ల సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. సుమారు మూడు గంటల పాటు ద్విచక్ర వాహనచోదకులు నరకయాతన అనుభవించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రధాన రహదారిపైకి వచ్చి భారీ వాహనాలను కొత్త రోడ్డు నుంచి సింగుపురం వైపు చింతాడ మీదుగా తరలించడంతో కొంతమేర ఊరట లభించింది.

ఎక్కడి వాహనాలు అక్కడే..