
ప్రాణాలు తీసిన పిడుగులు
● రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు
మృతి
జయపురం: కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి అంపావల్లి పంచాయతీ కందపుటాబంద్ గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు గ్రామంలో ఒక మహిళ దుర్మరణం చెందారు. వారితో పాటు వారి పెంపుడు కుక్క కూడా పిడుగుపడి మరణించినట్లు సమాచారం. మరణించిన వారిలో తండ్రి గమేల్ కృష్ణ, అతడి కుమార్తె గమేల్ కొమి(13), మహిళ గమేల్ తుంబయలు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వర్షం పడిన సమయంలో వారంతా ఒక చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగు చెట్టుపై పడడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. ఘటనపై దర్యాప్తు జరిపేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పంపినట్లు పొట్టంగి తహసీల్దార్ బహుదేర్ సింగ్ దరువ వెల్లడించారు.
పిడుగుపడి బాలుడు మృతి
రాయగడ: పిడుగుపడి బాలుడు మృతి చెందిన ఘటన జిల్లాలోని చందిలి పోలీసుస్టేషన్ పరిధి వంటామడలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాలుడు సన్యాసి హిమిరిక (15)గా గుర్తించారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో తమ కుటుంబీకులకు వ్యవసాయం పనుల్లో సహకరించేందుకు సన్యాసి తమ గ్రామానికి సమీపంలో పంట పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో ఒక చెట్టు కింద నిలబడిన సన్యాసిపై పిడుగుపడడంతో సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

ప్రాణాలు తీసిన పిడుగులు