
విగ్రహం ధ్వంసంలో నా ప్రమేయం లేదు
● పెంట పంచాయతీ సర్పంచ్
విశ్వనాథ్ స్పష్టీకరణ
రాయగడ: చందిలి పోలీసుస్టేషన్ పరిధి టంపరగుడ కొండపై బుద్ధుడి విగ్రహం ధ్వంసమైన ఘటనలో తన ప్రమేయం లేదని పెంట పంచాయతీ సర్పంచ్ ఎ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. ఈనెల 12వ తేదీన అర్థరాత్రి టంపరగుడ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయంపై బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జితు జకసిక పెంట పంచాయతీ సర్పంచ్‌పై చందిలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సర్పంచ్ విశ్వనాథ్ మంగళవారం పెంట పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తనపై ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. కొద్దిరోజుల క్రితం టంపరగుడ గ్రామ (కొండ కింద)లోని స్థలంలో అభిపలక అనే వ్యక్తి ప్లాటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో కొండపై బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేస్తే తమ ప్లాట్లకు మంచి ధర పలుకుతుందని భావించి అక్కడ విగ్రహం ఏర్పాటు చేశారని వివరించారు. అయితే కొండ ప్రాంతం రాష్ట్ర రెవెన్యూ విభాగానికి చెందినదని అయితే టంపరగుడ గ్రామ ప్రజలు ఆ కొండపై జీడి, మామిడి వంటి పంటలను పండించుకుని జీవనోపాధి పొందుతున్నారన్నారు. గ్రామస్తుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా కొండపై విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఒకవేళ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే అభిపలక అనే వ్యక్తి సొంత స్థలంలో ఏర్పాటు చేసుంటే తాము కూడా సహకరించేవాళ్లమని పేర్కొన్నారు. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేసేంత దుర్మార్గులము కాదని పేర్కొన్నారు. వారే విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వారే దానిని ధ్వంసం చేసి తిరిగి తమపై బురద జల్లేవిధంగా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అనంతరం టంపరగుడ గ్రామస్తులతో కలిసి జితు జకసికపై ఫిర్యాదు చేశారు.