
విద్యార్థులకు నడక పోటీలు
రాయగడ: నడకతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్థానిక సాయిప్రియ వాకర్స్ క్లబ్ సభ్యులు నడక పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 19 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షుడు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సాయిప్రియ నగర్ కాలనీలో నిర్వహించిన ఈ పోటీల్లో హుస్సేన్ ఖాన్ ప్రథమ స్థానం, హరున్, కె.రుచితేష్‌లు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. నడవడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు పేకే ప్రధాన్, కె.వైకుంఠరావు, బిజయ్ చంద్రపాత్రో, సన్యాసి పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.