
మత్య్సకార గ్రామాల్లో కూటమి చిచ్చు
సంతబొమ్మాళి: ప్రశాంతంగా ఉండే మత్స్యకార గ్రామాల్లో కూటమి పార్టీలు చిచ్చుపెడుతున్నాయని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. మండలంలోని జగన్నాథపురం తీరప్రాంత గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. గ్రామంలో అక్రమ కేసుల బాధితులైన సర్పంచ్ జోగి రాములమ్మ, ఉప సర్పంచ్ కొమర రామారావు, లండ రామారావులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారిని భయబ్రాంతులను గురి చేస్తున్నారన్నారు. మహిళ సర్పంచ్ జోగి రాములమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గ్రామంలో టీడీపీ కార్యకర్తలు గొడవపడితే ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నాయకులపైన, ఆ సమయంలో గ్రామంలోనే లేని సర్పంచ్ రాములమ్మపైన అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.
సీఐ నిర్వాకంతోనే అక్రమ కేసులు
టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావు నిర్వాకం వలనే వైఎస్సార్‌సీసీ నాయకులపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దయ్యబట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు తమకు కావాల్సినవారిని అన్ని శాఖల్లో నియమించుకొని తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీకు చెందిన నాయకులను ఆర్థికంగా నష్టపరిచేలా వ్యవహరిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పుడు పనులు చేసే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఆర్థికంగా నష్టపరిచినా, అక్రమ కేసులు బనాయించినా భయపడకుండా పార్టీకి అండగా నిలిచిన సర్పంచ్ రాములమ్మ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆదర్శమని కొనియాడారు. టీడీపీ నాయకుల దాడులకు ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందన్నారు. కింజరాపు కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన వేల కోట్లను జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్.రామిరెడ్డి, ఎన్ని మన్మథరావు, చింతల రాజులు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకటరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు సంపతిరావు హేమసుందరరాజు, అట్ల రాహుల్, సత్తారు సత్యం, కాళ్ల సంజీవరావు, పుక్కల లక్ష్మణరావు, మురళి పాల్గొన్నారు.
కక్ష సాధింపులకు ప్రతి చర్యలు తప్పవు
అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు సరికాదు
వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త
పేరాడ తిలక్