
తస్మాత్ జాగ్రత్త..!
సరుబుజ్జిలి: వేసవిలో ఉష్టోగ్రతలు తారాస్థాయికి చేరడంతో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఇటీవల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అయితే పలుచోట్ల పిడుగులు పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పిడుగు మాట వింటేనే ప్రజలు భయపడుతున్నారు. పొలాల్లో పనులు చేసుకొనే రైతులు, పశువుల కాపరులు ఎక్కువగా ప్రమాదాల బారినపడుతున్నారు. అలాగే సమీప ప్రాంతాల్లో ఇళ్లకు సమీపంలో పిడుగులు పడుతుండడంతో గృహోపకరణాలు కాలిపోయి తీవ్ర నష్టాలు ప్రజలు చవిచూస్తున్నారు. దీంతో పిడుగుపాటు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి పలు సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేయకూడదు
● వర్షం కురిసేటపుడు చెట్లకింద ఉండకూడదు.
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో ఉండరాదు.
● మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంతకన్న తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలోపు పిడుగుపడే అవకాశముంది.
● మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయవద్దు.
● గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్‌ఫోన్లు లేకుండా చూసుకోవాలి, సెల్‌ఫోన్ ఉంటే స్విచ్చాఫ్ చేయాలి. ● ఒక వేళ ఇవి ఉంటే రేడియన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశముంటుంది. ● వర్షంపడే సమయంలో విద్యుత్ తీగలు కింద, ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ● అలాగే అటువంటి సమయాల్లో చెప్పులు లేకుండా బయటకు వెళ్లరాదు.
● గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మెరుపులు, ఉరుములతో భయందోళనకు గురవుతారు. అటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రథమ చికిత్స చేయాలి
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను 1 అడుగుపైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమ చికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి.
– బమ్మిడి జ్యోతిర్మయి,
వైద్యాధికారి, పురుషోత్తపురం పీహెచ్‌సీ
పెరుగుతున్న పిడుగుపాటు ప్రమాదాలు
ప్రాణాలు తీస్తున్న పిడుగులు
అప్రమత్తంగా ఉండాలని సూచనలు

తస్మాత్ జాగ్రత్త..!

తస్మాత్ జాగ్రత్త..!