
సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం
భువనేశ్వర్: స్థానిక ఖారవేల భవన్‌లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మనోజ్ ఆహుజా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రముఖ కార్యదర్శులు హాజరయ్యారు. ప్రజాహిత పథకాల అమలు, సిబ్బంది సంక్షేమం, సాంఘిక భద్రత కార్యకలాపాల్ని ఈ సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ కొత్త పథకాల అమలు, వివిధ విభాగాలలో ఖాళీ పోస్టుల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత పదవీ విరమణ ప్రయోజనాలు, ఫించను మంజూరు వంటి అంశాల్ని కార్యదర్శులతో చర్చించారు.
కార్యదర్శుల జిల్లా సందర్శనలు, తదనంతర నివేదికల రూపకల్పన వంటి కీలకమైన అధికారిక చర్యల్ని ప్రముఖ కార్యదర్శి సమీక్షించారు. ఈ సమావేశానికి అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, అదనపు ప్రధాన కార్యదర్శులు సత్యబ్రత సాహు, సురేంద్ర కుమార్ మరియు హేమంత్ శర్మలతో పాటు వివిధ శాఖల ప్రముఖ కార్యదర్శులు, కమిషనర్లు మరియు కార్యదర్శులు హాజరై చర్చలలో పాల్గొన్నారు.