
‘శాసనసభ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి’
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు, పొట్టంగి నియోజక వర్గం ఎమ్మెల్యే రామ చంద్ర కదమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన లేఖ జారీ చేశారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి, కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణపై తక్షణ చర్చలు జరపాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి తీవ్రతను పేర్కొంటూ పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై తక్షణ చర్చను కోరుతున్నట్లు లేఖలో వివరించారు. ప్రజా ప్రతినిధులు ఈ పరిణామాలను చర్చించడానికి, జాతీయ భద్రత, ఐక్యతపై మన నిబద్ధత పునరుద్ఘాటన నేపథ్యంలో చర్చ కోసం అసెంబ్లీ అత్యవసర సమావేశం ప్రత్యేకత సంతరించుకుందన్నారు.
శ్రీ వారి వార్షికోత్సవానికి సన్నాహాలు
భువనేశ్వర్: స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవం నిర్వహణకు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 24న వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల 20న కోయిల ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిరవధికంగా కొనసాగుతుంది. 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత వార్షికోత్సవాలు జరుగుతాయి. సాయంత్రం పూట 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామి కల్యాణోత్సవం జరుగుతుందని ఆలయ అధికార వర్గాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మద్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ వారి అన్న ప్రసాద వితరణ నిరవధికంగా కొనసాగుతుంది.
సీబీఎస్సీ టెన్త్ ఫలితాల్లో
పలువురి ప్రతిభ
జయపురం: మంగళవారం ప్రకటించబడిన సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలో జయపురం మోడరన్ ఇంగ్లిష్ స్కూల్ వంద శాతం ఫలితాలు సాధించింది. ఆ పాఠశాల నుంచి 161 మంది పరీక్షలు రాయగా వారంతా ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో సౌమ్య మిశ్ర 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఈ పాఠశాలలో 11 మంది 90 శాతం మర్కులతో ఉత్తీర్ణులు అయ్యారని పాఠశాల వర్గాలు తెలిపాయి. పాఠశాల టాపర్ అయిన సౌమ్యమిశ్ర తాను ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో ఉన్నాని తన అభిప్రాయం వెల్లడించింది. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందిస్తూ మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పాఠశాల డైరెక్టర్ శ్రీమతి కుముద మాల మహంతి హితవు పలికారు.