
టెక్కలిలో కింజరాపు ట్యాక్స్
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు ట్యాక్స్‌తో పెద్ద ఎత్తున దోపిడీ పర్వం కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సోమవారం టెక్కలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా ట్లాడారు. గత ప్రభుత్వంలో ఎంతో పారదర్శకంగా ఏజెన్సీ వ్యవస్థతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఆ వ్యవస్థలను పక్కన పెట్టి విచ్చలవిడి గా కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. టెక్కలి నియోజకవర్గంలో ఎ లాంటి లీజు అనుమతులు లేకపోయినప్పటికీ అక్రమంగా కంకర తవ్వకాలు చేస్తున్నారని, దీనికి కింజరాపు ట్యాక్స్ కడితే చాలని తిలక్ దుయ్యబట్టారు. గోవిందపురం సమీపంలో సర్వే నంబర్ 71 లో వైఎస్సార్‌సీపీకి చెందిన మండపాక నర్సింగరావు అన్ని రకాల అనుమతులతో గ్రావెల్ క్వారీ నిర్వహిస్తుండగా, ఆ క్వారీలో మంత్రి అచ్చెన్నాయుడు, సోదరుడు హరిప్రసాద్ అక్రమంగా తవ్వకాలు చేసి కంకర తరలించేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న గ్రావెల్ తరలింపు ఆపకపోతే వచ్చే సోమవారం గ్రావెల్ క్వారీను ముట్టడిస్తామని తిలక్ హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారానికి కింజరాపు ప్రసాద్, మైనింగ్ వ్యాపారానికి ఆయన కుమారుడు సురేష్ డాన్‌లుగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయం కింజరాపు కుటుంబానికి వెళ్తోందన్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన మహిళా మాజీ మంత్రి విడుదల రజినిపై పోలీసుల ప్రవర్తన హేయమని తిలక్ మండిపడ్డారు.
మైనింగ్, లిక్కర్ వ్యాపారాల్లో కింజరాపు కుటుంబానికి పెద్ద ఎత్తున వాటాలు
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్