
20 యూనిట్ల రక్త సేకరణ
జయపురం: జయపురం సమితి బరిణిపుట్ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం గ్రీష్మ కాల స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 20 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వేసవిలో రక్త కొరత నివారించేందుకు ఒడిశా రక్త దాత మహాసంఘం ఆహ్వానం మేరకు జయపురం ప్రతిమ అంబిక ట్రస్టు గ్రీష్మ కాల రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ట్రస్టు అధ్యక్షురాలు మమత బెహర ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పెహల్గాన్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల తుపాకుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులర్పించారు. శిబిరంలో ట్రస్టు కార్యకర్తలు, ఒడిశా రక్తదాత మహాసంఘ ప్రతినిధి ప్రమోద్ కుమార్ రౌళో శిబిరాన్ని పర్యవేక్షించారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి బ్లడ్‌బ్యంక్ టెక్నికల్ బృందం దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మమతా బెహర మాట్లాడుతూ.. రక్త దానం బృహత్తరమైనదన్నారు. రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులకు, గర్భిణులకు, సికిల్‌సెల్, అలోసెమియ, కేన్సర్ రోగులకు రక్తం ఎంతో అవసరం ఉంటుందన్నారు. రక్తాన్ని దానం చేసేందుకు అర్హులందరూ ముందుకు రావాలన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తే కొరతను నివారించవచ్చునన్నారు. ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఒడిశా బ్లడ్ డొనేషన్ శిబిరానికి పూర్తి సహకారం అందజేశారు. శనివారం రాష్ట్రంలో ఒడిశా రక్తదాత మహాసంఘం 45 రక్తదాన శిబిరాలు నిర్వహించి 1755 యూనిట్ల రక్తాన్ని సేకరించిందని మహాసంఘ ప్రతినిధి ప్రమోద్ కుమార్ రౌళో వెల్లడించారు. ఈ సందర్భంగా రక్త దాతలకు ప్రశంసా పత్రాలతో సత్కరించారు.