
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
కొరాపుట్: స్వగ్రామంలోని దేవాలయాలను హైకోర్టు మాజీ జడ్జి దంపతులు సందర్శించారు. ఆదివారం నబరంగ్‌పూర్ పట్టణానికి చెందిన మధ్యప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుశీల్ పాల్, అతని సతీమణి మధ్యప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అంజలీ పాల్ స్వగ్రామంలో పర్యటించారు. పురాతన ఈశ్వర్ మందిరం, జగన్నాథ, బండారు ఘరణి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాల్ దంపతులు నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం స్వస్థలం. ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులు రాక సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
శ్రీముఖలింగంలో భక్తుల సందడి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వైశాఖిమాసం మొదటి ఆదివారం భక్తులు సందడి చేశారు. హిరమండలం పరిధి అంబా విల్లి త్రినాథ స్వామికి మొదటి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శ్రీముఖ లింగం తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహించారు. అలాగే జిల్లా నలుమూలలతోపాటు పక్క రాష్ట్రాలైన వియనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలి వచ్చారు. అర్చకులు గణ పతి పూజతో ప్రారంభించి స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారాహి అమ్మవారికి కూడా కుంకుమ పూజలు చేశారు. మరికొంద రు తమ కోర్కెలు తీరడంతో గోలెంలో బియ్యం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో క్లీనర్‌కు గాయాలు
రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, హైవే పెట్రోలింగ్ ఏఎస్‌ఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో క్లీనర్ సదాశివం కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. వెంటనే హైవే పోలీసులు అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ముమ్మరంగా తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్ : దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఉత్తర్వులతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య కూడళ్లలోను, ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణ, పేలుడు పదార్థాల గుర్తింపు, సంఘ విద్రోహక శక్తుల అడ్డుకట్ట, కొత్త, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు.
కళకళలాడిన కాంప్లెక్స్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించింది. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ప్రయాణికుల తాకిడి మరింత అధికమైంది. తిరుగు ప్రయాణంలో కాంప్లెక్స్‌లో నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద ప్రయాణికులు టికెట్‌ల కోసం క్యూలో బారులు తీరుతూ కనిపించారు. నాన్‌స్టాప్ బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీ అధికారులు త్వరితగతిన స్పందించి ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు నాన్‌స్టాప్ బస్సుల స్థానంలో పల్లెవెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నడిపారు.

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు