
వాహనదారులను దోచుకుంటున్న ఇద్దరు అరెస్టు
జయపురం: రహదారులపై మోటారు వాహనాలను అడ్డుకొని డబ్బు లూటీ చేస్తున్న ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు. అరెస్టు అయినవారు జయపురం సమితి ఉమ్మిరి గ్రామం హృదానంద నాయక్ ఉరఫ్ ప్రిన్స్, అదే గ్రామానికి చెందిన సంజయ సున అని వెల్లడించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీ రాత్రి సబ్ ఇన్‌స్పెక్టర్ సులోచన ప్రధాన్, ఏఎస్‌ఐ పంకజినీ శబరలు పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేపట్టారు. అంబాగుడ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో కేవిడి రోడ్డులో దోపిడీ దొంగలు వాహనాలను అడ్డుకొని ప్రయాణీకులకు తుపాకీ చూపి డబ్బులు దోచుకుంటున్నారని సమాచారం అందింది. వెంటనే పెట్రోలింగ్ టీమ్ ఘటనా ప్రాంతానికి వెళ్లారు. కెవిడి కోళ్ల ఫారం వద్ద ఇద్దరు యువకులు నిల్చోని ఉన్నారు. పోలీసులను చూసి వారు పరుగుతీశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా తూటాలు లేని ఫిస్టల్, కొంత నగదు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

వాహనదారులను దోచుకుంటున్న ఇద్దరు అరెస్టు