
ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్
మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి ఎంవీ 26 గ్రామానికి చెందిన దేభశిష్ సర్కార్ (32) అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దేభశిష్ గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దీంతో బెట్టింగ్స్‌లో ఓడిపోయి ఊరంతా అప్పులు పాలయ్యాడు. ఇటీవల అప్పులు ఇచ్చినవారు డబ్బులు అడగగా, అందరికీ శుక్రవారం ఇస్తానని చెప్పాడు. అనంతరం కుటుంబ సభ్యులతో గురువారం రాత్రి సంతోషంగా గడిపాడు. శుక్రవారం వేకువజామునే లేచి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. తీరా చూస్తే ఉదయం 6 గంటల సమయంలో ఇంటికి కొంతదూరంలోని చెట్టుకు ఉరికి వేలాడుతూ కన్పించాడు. దీంతో గ్రామస్తులు వెంటనే మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దేభశిష్‌కు భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.