
రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధ్రువపత్రం అందుకుంటున్న అశ్విని వైష్ణవ్
భువనేశ్వర్: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల ఘట్టం ముగిసింది. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. కేంద్ర రైల్వేశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అశ్విని వైష్ణవ్, బిజూ జనతాదళ్ అభ్యర్థులు దేబాశిష్ సామంతరాయ్, సుభాశిష్ ఖుంటియాలు మంగళవారం రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒడిశా నుంచి మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు.
● ఉపసంహరణ గడువు పూర్తి
పోటీలో నుంచి అభ్యర్థులు వైదొలిగేందుకు మంగళవారంతో గడువు ముగిసింది. దీంతో ముగ్గురినీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి వీరికి సర్టిఫికెట్లను అందజేశారు. కటక్ బరాబటి మాజీ ఎమ్మెల్యే దేబాశిష్ సామంతరాయ్, బిజూ యువ జనతా దళ్ (బీవైజేడీ) ఉపాధ్యక్షుడు సుభాశిష్ ఖుంటియాలు అధికార బీజేడీ తరపున 2 రాజ్యసభ స్థానాలకు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ మూడో స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అశ్విని వైష్ణవ్ తన పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తామని బీజేడీ గతంలోనే ప్రకటించింది. 2019లో మొదటిసారి రాజ్యసభకు పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి అశ్విని వైష్ణవ్‌కు బిజూ జనతా దళ్ (బీజేడీ) మద్దతు ఇవ్వడంతో వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు తొలిసారి ఎన్నిక అయ్యారు. తాజా విజయంతో వరుసగా రెండోసారి బీజేడీ మద్దతుతో రాజ్యసభకు పట్టం గట్టింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలనూ గెలుచుకోవడానికి అవసరమైన బలం బీజేడీకి ఉంది. రాష్ట్ర శాసనసభలో బీజేపీకి నామమాత్రంగా 22 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేడీ బలం కూడగట్టుకుని రాజ్యసభ ఎన్నికల్లో గట్టెక్కడం రాజకీయ చతురతకు తార్కాణంగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 3న అశ్విని వైష్ణవ్, బీజేడీ నేతలు ప్రశాంత్ నందా, అమర్ పట్నాయక్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ సభ్యుల సీట్లు ఖాళీ అవుతాయి.
ధ్రువీకరణ పత్రాలు అందజేత

ధ్రువపత్రం అందుకుంటున్న దేబాశిష్ సామంత్రాయ్

ధ్రువపత్రం అందుకుంటున్న సుభాసిస్ ఖుంటియా