
పూజలు అందుకుంటున్న వినాయకుడు
● తవ్వకాల్లో లభించిన వినాయక విగ్రహాలు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి మల్లవారం పంచాయతీ బడాన్‌గూడ గ్రామంలోని ఒక రైతు కలలో వినాయకుడి విగ్రహం కన్పించి, పొలంలో తవ్వితే అదే విగ్రహం లభించిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బడాన్‌గూడ గ్రామంలో నివాసముంటున్న భీమా మిచు అనే రైతుకు మంగళవారం తెల్లవారుజామున కలలో వినాయకుడి విగ్రహం కన్పించి, తన పొలంలో కొలువై ఉన్నానని చెప్పి బయటకు తీయాలని ఆదేశించింది. దీంతో సదరు రైతు విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం కూడా అదే కల వచ్చినట్లు గ్రామస్తులకు చెప్పాడు. దీంతో మంగళవారం ఉదయం గ్రామస్తుల సాయంతో చెరువు పక్కనే ఉన్నటువంటి తన పొలంలో తవ్వి చూశారు. అయితే కలలో కనిపించిన విగ్రహమే అక్కడ లభ్యమవ్వడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే విగ్రహాన్ని బయటకు తీసి, పొలం పక్కన ఉన్నటువంటి చెరువు గట్టుమీద ఉంచి గ్రామస్తులంతా పూజలు చేశారు. విషయం తెలిసిన గ్రామంలోని వృద్ధులు శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో ఇక్కడ విగ్రహాలను పెట్టి పూజించేవారని చెబుతున్నారు. అప్పటిలో శ్రీరాముడు ఇక్కడ చిన్న గొయ్యిని తవ్వి స్నానమాచరించాడని, అందుకే ఆ చెరువును రామ చెరువు అంటారని పేర్కొన్నారు. పురావస్తు శాఖ అధికారులు బుధవారం గ్రామంలో దొరికిన విగ్రహాలను పరిశీలించారు. అధికారులతో భీమా మాట్లాడుతూ.. మరికొంత దూరంలో శివుడు, పార్వతీ, లక్ష్మీదేవి విగ్రహలు ఉన్నట్లు తన కలలో కన్పించినట్లు చెప్పాడు. దీని ప్రకారం తవ్వగా మరికొన్ని చోట్ల శ్రీరాముని పాదముద్రలు దొరికాయి. అయితే విగ్రహాలకు గుడికట్టి పూజ చేస్తామని గ్రామస్తులు అధికారులకు కోరారు. విగ్రహాల పరిశీలనకు భువనేశ్వర్ పంపిస్తామని అధికారులు తెలియజేశారు.

మట్టిలో దొరికిన విగ్రహాలు