
గుమ్మలక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం చదువుకు చక్కని ప్రాధాన్యమిస్తోందని, అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా రాణించాలని జాతీయ ఎస్టీకమిషన్ సభ్యుడు అనంతనాయక్ సూచించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకుని సంతోషం వ్యక్తంచేశారు. చక్కని మెనూ, నాడు–నేడుతో సర్కారు బడులకు ఆధునిక సదుపాయాల కల్పన, వివిధ పథకాలతో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించడం బాగుందన్నారు. విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ముందుకు ఏకలవ్య పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. కొండ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న 4జి సెల్ టవర్స్‌ను సూచిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్‌ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట పార్వతీపురం ఐటీడీఏ పీఓ సి.విష్టుచరణ్, డీడీ కె.శ్రీనివాసరావు, వైకేపీ ఏపీడీ సత్యనారాయణ, ఎంఈఓలు చంద్రశేఖర్, జనార్దనరావు, ఏటీడబ్ల్యూఓ సురేష్‌కుమార్, ఎంపీడీఓ సాల్మన్‌రాజ్, తహసీల్దార్ జె.రాములమ్మ, తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన భద్రగిరి సీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
ఏకలవ్య పాఠశాలను సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు