నాన్నా సారీ.. ​​​​​​​పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోనని..

- - Sakshi

శ్రీకాకుళం క్రైమ్‌ : ‘నేను ఎగ్జామ్స్‌కు సరిగా చదవలేకపోయాను. పరీక్షల్లో తప్పుతానేమోనని భయంగా ఉంది.. నాన్నా సారీ..’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాస్తూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో శుక్రవారం కలకలం రేపింది. ఎస్‌ఐ బలివాడ గణేష్‌ తెలిపిన వివరాల ప్రకారం గార మండలం కొల్లివలస గ్రామానికి చెందిన అప్పిలి రాంబాబుకు మేఘన, హేమలత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు వ్యవసాయంలో కలిసి రాక తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

2021 జూన్‌లో పెద్ద కుమార్తె మేఘనను ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు గ్రామానికి చెందిన యెన్ని కాంతారావుకు ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే పాలిటెక్నిక్‌ చదువుతున్న మేఘన చదువు కొనసాగించడానికి భర్త ఒప్పుకోవడంతో తండ్రి ఇంటి వద్దనే ఉంటూ కళాశాలకు వెళ్లేది. పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం పూర్తయి పరీక్షలు అడ్వాన్స్‌డ్‌ రాసింది. అయితే పరీక్ష బాగా రాయలేదని బాధ పడుతూ ఉండడంతో ఆమెను తండ్రి రాంబాబు శ్రీకాకుళం అరసవిల్లి బొంపాడవీధిలో నివాసముంటున్న తన మరదలు దుబ్బాక రోహిణి ఇంటికి వారం రోజుల ముందు పంపించారు.

అయితే మేఘన ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి సూసైడ్‌ నోట్‌ రాసి శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయట నుంచి వచ్చిన మేఘన పిన్ని జరిగిన ఉరి వేలాడుతున్న మేఘన మృతదేహాన్ని చూసి నిశ్చేష్టురాలైంది. వెంటనే మేఘన తండ్రి రాంబాబుకు ఫోన్‌ చేయడంతో భార్యతో కలిసి వచ్చి భోరున విలపించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top