శనివారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2023

భువనేశ్వర్‌ లోని లింగరాజ దేవస్థానం  - Sakshi

ఈనెల 29న రుకుణ, ఏప్రిల్‌ 2న బహుడా యాత్రలు

మంత్రి అశోక్‌చంద్ర అధ్యక్షతన ఏర్పాట్లపై సమీక్ష

బ్రాహ్మణ, పూజా పండా, నియోగ సేవాయత్‌లు గైర్హాజరు

భువనేశ్వర్‌: పవిత్ర అశోకాష్టమి పురస్కరించుకుని ఏటా లింగరాజు రథయాత్ర నిర్వహిస్తారు. ఈ యాత్ర రుకుణ రథయాత్రగా ప్రసిద్ధి. ఈనెల 29న రుకుణ రథయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి అశోక్‌చంద్ర పండా అధ్యక్షతన సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది. అయితే ఈ కీలక సమావేశానికి బ్రాహ్మణ, పూజాపండా, నియోగ సేవాయత్‌ వర్గాలు హాజరు కాలేదు. లింగరాజు ప్రభువు రథయాత్రలో వీరి పాత్ర అత్యంత కీలకం. సాంప్రదాయ ఆచార వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత వీరిది. తరచుగా వీరి సహాయం నిరాకరించడం సర్వత్రా అసంతృప్తి కలిగిస్తోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో మేయర్‌ సులోచన దాస్‌, జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ ప్రఫుల్ల స్వొయి, విద్యుత్‌ విభాగం అధికారులు హాజరయ్యారు.

ఈ ఏడాది రథ నిర్మాణంలో కలపతో సమస్యలు ఎదురయ్యాయి. కలప ఆలస్యంగా చేరడంతో నిర్మాణంలో జాప్యం చోటు చేసుకుంటుందనే ఆందోళన తలెత్తింది. సకాలంలో రథం సిద్ధం చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తున్నట్లు మహరణ సేవాయత్‌ వర్గం తెలిపింది. యాత్ర సమయానికి రథం అందజేస్తామని నిర్వాహక వర్గానికి హామీ ఇచ్చారు. ఈనెల 29న లింగరాజు రుకుణ రథయాత్ర జరగనుండగా, ఏప్రిల్‌ 2న మారు రథయాత్ర(బహుడా) చేపట్టనున్నారు.

ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా యాత్ర సక్రమంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చించారు. రుకుణ రథయాత్ర పురస్కరించుకుని ఈనెల 29న ఉదయం 5 గంటలకు మంగళ హారతితో నిత్య సేవాదులను సకాలంలో ప్రారంభించి, ఉత్సవ ప్రత్యేక పూజాదులను ముగించడతో మధ్యాహ్నం 1.30 గంటలకు రథంపైకి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సూర్య అస్తమయానికి ముందుగా రథం గమ్యం చేరేందుకు ఈ సమయ పాలన దోహదపడుతుందని సేవాయత్‌ వర్గానికి అభ్యర్థించారు.

న్యూస్‌రీల్‌

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top