భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం అభినందన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎస్. సవిత పాల్గొని మాట్లాడారు. విద్యతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనున్నామని ఆమె తెలిపారు. ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఎంజేపీ గురుకులాల్లో రూ.1.50లక్షలు, బీసీ హాస్టళ్లలో రూ.75వేలు వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సంఖ్యను 42 నుంచి 109కి పెంచామని చెప్పారు. ఆరు ఎంజేపీ గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
వార్డెన్లు మార్గదర్శకత్వం చేయాలి..
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. హాస్టళ్లు గురుకులాల్లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులు మారుతున్న ప్రపంచ పోటీని ఎదుర్కొనేందుకు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ టెన్త్, ఇంటర్‌లో బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులు ఈ ఏడాది గణనీయమైన ఫలితాలను సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజేపీ కార్యదర్శి మాధవీ లత, అడిషనల్ డైరెకటర్ చంద్రశేఖరరాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పేరేపి ఈశ్వర్, వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు పాల్గొన్నారు.
పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత


