ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు చల్లపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, వాటిని భవిష్యత్తులో మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో కలిసి చల్లపల్లి మండలంలో పర్యటించారు. తొలుత మండల పరిధిలోని లక్ష్మీపురంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి చల్లపల్లిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లారు. బయోవేస్ట్‌ నిర్వహణ గదులు, కొత్తగా నిర్మించిన గేట్లు, సైకిల్‌ షెడ్డు, మార్చురీలో ఫ్రీజర్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తొలుత ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కోరారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ రోగులుపట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని చెప్పారు. 21నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఈ నెల 21న ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సమావేశం జరిగింది. మే 21 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 57 కేంద్రాల్లో రెండు సెషన్లలో థియరీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరానికి సంబంధించి 23,316 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 14,819 మంది మొత్తం 38,135 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అదేవిధంగా విజయవాడలోని ఒక కేంద్రంలో రెండు సెషన్లలో జూన్‌ 7 నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి (డీఐఈవో) బి.ప్రభాకరరావు, డీఈ వో ఎల్‌.చంద్రకళ, డీపీవో పి.లావణ్యకుమారి, డీఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభయాంజనేయునికి విశేష పూజలు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఐదో రోజైన సోమవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకు లు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవకలశ స్నపన, శాంతి హోమం, సిందూర అర్చన జరిగాయి. ఆధ్యాత్మిక వేదికపై భక్తి సంకీర్తన చేశారు. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు, నక్షత్ర హారతి వైభవంగా నిర్వహించారు. అనంతరం కళావేదికపై ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అబ్బురపర్చాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు, ఆలయ పాలకమండలి చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement