గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్ పేరుతో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు నష్టం చేసే నిర్ణయాలు మానుకోవాలని ఏపీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ధర్నాకు తరలివచ్చారు. ధర్నా నుద్దేశించి జేఏసీ చైర్మన్ దయామణి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్లియర్ వేకెన్సీలు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని, రిటైర్‌మెంట్ వయసు 62ఏళ్లకు పెంచాలని, బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. ధర్నాలో కన్వీనర్ ప్రభాకరరెడ్డి, కోశాధికారి జే సింహాచలం, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.


