చిట్టినగర్(విజయవాడపశ్చిమ): హనుమాన్ దీక్షను ఆచరించడంతో పాటు హనుమాన్ చాలీసా పఠనం ద్వారా శక్తి, యుక్తి, కార్యసామర్థ్యాలను పెంపొందించుకుని దేశం, ధర్మం కోసం పని చేయాలని త్రిదండి చినజీయర్ స్వామిజీ సూచించారు. పాలప్రాజెక్టు ఎదుట ఉన్న శ్రీ హనుమత్ దీక్షా పీఠంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిస్ఠ, కుంభాభిషేకం మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పీఠాధి పతి దుర్గాప్రసాద్ స్వామిజీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా త్రిదండి చినజీయర్ స్వామిజీ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, బీజీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. తొలుత పీఠంలోని ప్రధాన ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠను త్రిదండి చినజీయర్ స్వామి, దుర్గాప్రసాద్ స్వామిజీ నిర్వహించారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఆలయం సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల ఆవరణలో ప్రత్యేక హోమాలు, యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంపై భాగంలో కలశస్థాపన, కుంభాషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామి భక్తలకు అనుగ్రహ భాషణం చేశారు. హనుమంతుడి ఆవిర్భావం, విశిష్టతతో పాటు ఆయన మహిమలు, రామాయణంలో ధర్మరక్షణ కోసం హనుమంతుడు చూపిన శక్తి, యుక్తులు, కార్యసిద్ధిని త్రిదండి చినజీయర్ స్వామిజీ భక్తులకు వివరించారు. దుర్గాప్రసాద్ స్వామిజీ మాట్లాడుతూ.. 1912లో ప్రారంభమైన హనుమత్ దీక్ష పీఠం 2026 నాటికి వైభవంగా అభివృద్ధి చెందిందన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ జీయర్, కమలానంద భారతీ స్వామి, హైదరాబాద్‌కు చెందిన సాయికుమార్ బాబాజీతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి హనుమత్ దీక్షను స్వీకరించిన పలువురు భక్తులు, ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు.


