కంచికచర్ల: కంచికచర్ల సెక్షన్‌లో విద్యుత్ వినియోగదారుల గృహాలు, వాణిజ్య సముదాయాలపై సోమ వారం విద్యుత్‌శాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం స్థానిక ఓసీ కల్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో విజిలెన్స్ శాఖ ఈఈ పి.విజయకుమారి మాట్లాడుతూ.. తాను, విజయవాడ రూరల్ ఈఈ టి.రవిచంద్ర, డీఈఈ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 41 బృందాలుగా ఏర్పడి 469 గృహ సర్వీసులు, ఎనిమిది వాణిజ్య సర్వీసుల సముదాయాలను తనిఖీ చేశామన్నారు. 477 సర్వీసులకు సంబంధించి అదనపు లోడ్ 665 కేవీ విద్యుత్‌ను చౌర్యం చేసి వినియోగించినట్లు గుర్తించి, బాధ్యులకు రూ.14.63 లక్షల జరిమానా విధించామని తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, ఇందుకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగినట్లు గుర్తిస్తే 83310 14951, 83310 20537 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కంచికచర్ల ఏఈబీ, ఏఈలు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
చల్లపల్లి: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని వక్కలగడ్డ ఐదో నంబర్ కాలువ వద్ద చల్లపల్లి–పామర్రు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. చల్లపల్లి నారాయణరావునగర్‌కు చెందిన 70 ఏళ్ల పాస్టర్ కె.రాజేంద్ర ప్రసాద్ ద్విచక్రవాహనంపై దళితవాడ నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన యువకుడు అనిల్ బైక్‌పై చల్లపల్లి నుంచి వక్కలగడ్డ వైపు వెళ్తున్న క్రమంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. రాజేంద్రప్రసాద్‌కు కాలు విరిగి తలకు బలమైన గాయమైంది. అనిల్‌కు కూడా గాయాలయ్యాయి. చల్లపల్లి 108 ఈఎంటీ దాసి బసవరాజు, పైలెట్ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన చల్ల పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాస్టర్ రాజేంద్రప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. కొంతసేపటి తరువాత అనిల్‌ను కూడా మరొక అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రేమాలవారిపాలెం (నాగాయ లంక): స్థానిక వంతెన సెంటర్ లోని శ్రీఅభయాంజనేయ దేవస్థానంలో స్వామివారికి సోమ వారం రజత కవచ మహోత్సవం వైభవంగా జరిగింది. రేమాలవారిపాలెంనకు చెందిన గుడి కోటేశ్వరరావు – రత్నమంజుల, రాంబాబు – కృష్ణకుమారి స్వామికి 20 కిలోల వెండితో ఏడు అడుగుల కవచం సమర్పించిన నేపథ్యంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దాతల నేతృత్వంలో తొలుత వంతెన సెంటర్ నుంచి కవచ మహోత్సవ ఊరేగింపు నిర్వహించారు. కేరళ సంప్రదాయ చండీ మేళ తాళాలు, ఆధ్యాత్మిక కోలాట బృందాలతో భక్తులు నాగాయలంక ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. అనంతరం స్వామి విగ్రహానికి రజత కవచం సమర్పించి విశేషపూజ చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది.


