రామవరప్పాడు: సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు యువత, విద్యార్థులు ముందుకు రావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సోమ వారం ప్రాజెక్ట్ ఎక్స్‌పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్ట్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభ, పరిశోధనా దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను అభినందించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధనాత్మక దృష్టి అలవరుచుకుని దేశాభివృద్ధికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, స్మార్ట్ టెక్నాలజీస్, స్మార్ట్ హోమ్ సిస్టమ్స్, ఆటో మేటిక్ కంట్రోల్ మోడల్స్ వంటి ఆధునిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బి.ఎస్.అప్పారావు, సెక్రటరి శ్రీకృష్ణ, ప్రిన్సిపాల్ చైతన్య, జిల్లా యువజన సర్వీసుల అధికారి కొల్లెటి రమేష్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
చెస్ క్రీడాకారిణి రేణుకకు అభినందన
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని స్కౌట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గత నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫిడే అర్బిటర్ ఎగ్జామ్‌లో ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న పోలదాస్ రేణుక క్వాలిఫై అయ్యి ఫిడే అర్బిటర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో రేణుకను సోమ వారం అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ పాషా మాట్లాడుతూ.. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 19 మంది ఈ పరీక్షకు హాజరవగా తొమ్మిది మంది మాత్రమే ఆర్బిటర్ టైటిల్‌కు అర్హత సాధించారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గోలి వేణు, కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.దివ్యతో పాటు పలువురు చెస్ క్రీడాకారులు పి.రేణుకను అభినందించారు.


