యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

May 12 2026 5:18 AM | Updated on May 12 2026 5:18 AM

రామవరప్పాడు: సరికొత్త ఆవిష్కరణల రూపకల్పన దిశగా యువ పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్టీఐహెచ్‌)లో సోమవారం జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీఐహెచ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్‌ ట్రిక్స్‌ –2026ను ఆ సంస్థ సీఈఓ జి.కృష్ణన్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్‌ ట్రిక్స్‌ –2026 యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశంగా నిలుస్తోందన్నారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతలో సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా ఈ తరహా వేదికలు దోహదపడతాయన్నారు. ఆర్టీఐహెచ్‌ ద్వారా 500 వరకు స్టార్టప్‌లకు చేయూత ఇచ్చామని తెలిపారు. ఉత్తమ స్టార్టప్‌లుగా నిలిచిన వారికి వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు చొప్పున నగదు బహుమతులను ప్రకటించినట్లు వెల్లడించారు. టెక్‌ ట్రిక్స్‌ స్టార్టప్‌ ఎక్స్‌పోలో దాదాపు 120 స్టార్టప్‌ల ప్రదర్శన యువ మేధస్సుకు ప్రతిరూపాలుగా నిలిచాయన్నారు. చిన్నారుల్లో సులువుగా అభ్యసన నైపుణ్యాలు పెంపొందించే ఈసీ స్లేట్‌ డీప్‌ ల్యూర్‌, సేంద్రియ సాగుకు ఉపయోగపడే డబుల్‌ పవన్‌ పంప్‌సెట్‌ స్ప్రేయర్‌, అడ్వాన్స్‌డ్‌ యాక్సిడెంట్‌ ప్రివెన్షన్‌ అండ్‌ డిటెక్షన్‌ టెక్నాలజీ, హైడ్రాలిక్‌ లిఫ్ట్‌, జెన్‌ సైన్స్‌ వంటి సంస్థలు, స్టార్టప్‌ల ప్రదర్శన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, సందర్శకులను ఆకట్టు కున్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ ఎ.ఎన్‌. వి.నాంచారరావు, జిల్లా యువజన సంక్షేమ అధి కారి కొల్లేటి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement
 
Advertisement
Advertisement