తిరువూరు: డ్వాక్రా మహిళలు, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్న అంతర్ జిల్లా నేరస్తుడిని తిరువూరు పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. తిరువూరు సీఐ గిరిబాబు కథనం మేరకు.. ఈ నెల ఐదో తిరువూరు రాజుపేట స్టేట్ బ్యాంకు శాఖకు డ్వాక్రా మహిళల రుణ వాయిదాలు, పొదుపు నగదు జమ చేయడానికి వచ్చారు. ఆ సమయంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదులకు చెందిన షేక్ నాగూర్‌మీరావలీ వారితో తాను బ్యాంకు ఉద్యోగినని పరిచయం చేసుకుని మోసపూరిత మాటలతో నగదు తస్కరించాడు. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి నగదు తీసుకుని ఖాతాలో జమ చేస్తానని నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ రబ్బరు స్టాంపులు, సంతకాలతో రూ.93 వేల నగదు కాజేశాడు. తరువాత తమ బ్యాంక్ ఖాతాలో నగదు జమకాలేదని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరువూరు ఎస్‌ఐ శాతకర్ణి సోమవారం తిరువూరు ఆర్టీసీ బస్టాండులో నిందితుడిని అరెస్టు చేసి రూ.1.52 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నాగూర్ మీరావలీ ఆర్థికమోసాలకు పాల్పడగా 38 కేసులు నమోదయ్యాయి. నిందితుడిని తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ గిరిబాబు తెలిపారు.


