వసూళ్ల రాజ్యం! | - | Sakshi
Sakshi News home page

వసూళ్ల రాజ్యం!

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

వసూళ్ల రాజ్యం! ఉన్నతాధికారుల సహకారంతో..

అవనిగడ్డ పంచాయతీలో ఇద్దరు ఉద్యోగుల అవినీతి బాగోతం ప్రతి పనికి ఓ రేటు సంవత్సరాలుగా ఇక్కడే విధులు

ఎవరైనా సరే ముందుగా వారిని కలవాల్సిందే!

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేస్తూ ఇద్దరు ఉద్యోగులు జోరుగా వసూళ్లు చేస్తున్నారు. ఏళ్లుగా అక్కడే తిష్ట వేసి అవినీతి బాగోతం నడుపుతున్నారు. అదెక్కడంటే బందరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అవనిగడ్డ పంచాయతీ. దానిలో ఇద్దరు ఉద్యోగులు వసూల్‌ రాజాలుగా మారారు. పంచాయతీ పరిధిలో సుమారు 10 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. వారికి ఎంతో కొంత ముట్టచెప్పనిదే పని జరగదని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నేళ్లయినా ఇక్కడే విధులు నిర్వహించడం చూస్తుంటే వీరి వసూళ్ల పర్వం ఎంత మేర జరుగుతోందో అని ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు.

జలజీవన్‌ మిషన్‌ ద్వారా అధిక వసూళ్లు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్‌ మిషన్‌ పథకానికి జిల్లాలో అవనిగడ్డ పంచాయతీని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇది పంచాయతీలోని ఇద్దరు కీలక ఉద్యోగులకు పాడికుండలా మారింది. జలజీవన్‌మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమైతే వీరికి మాత్రం వసూళ్ల పర్వానికి ఉపయోగపడింది. కుళాయి కనెక్షన్‌ కోసం ఒక్కొక్క ఇంటికి రూ. 20 వేలు వసూలు చేసినట్లు ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఇలా పంచాయతీ పరిధిలో 1,465 కనెక్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా భారీ మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం.

షాపుల కేటాయింపులోనూ చేతివాటం

అవనిగడ్డ పంచాయతీ పరిధిలో 40 షాపులు ఉన్నాయి. మూడేళ్లకొకసారి వాటికి బహిరంగ వేలం నిర్వహించి అధిక మొత్తంలో పాడుకున్న వారికి షాపును అప్పగించాలనే నిబంధన ఉంది. వీరు చేతివాటం చూపి ఒక్కొక్క షాపు నుంచి రూ. 50 వేలు వసూలు చేసి బహిరంగ వేలం నిర్వహించినట్లుగా రికార్డులు చూపి తిరిగి వారికే షాపులు కేటాయిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇద్దరు షాపు యజమానులు రూ. 9 లక్షల పాత బకాయిలు ఉండగా వారికి పంచాయతీ నుంచి లీగల్‌ నోటీసులు పంపి వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాల్లో కూడా కార్యదర్శి తన చేతివాటాన్ని ప్రదర్శించి వారి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి ఎటువంటి బాకీ లేదని ధ్రువీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

పంచాయతీ ముఖ్యఅధికారి అయిన అతను విధి నిర్వహణలో ప్రతిభ కనపరచకపోయినా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలో తనదైనశైలి చూపుతారనేది అక్కడి ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. 2019 నుంచి ఇక్కడే పనిచేస్తున్న ఈ అధికారి ఇటీవల నడకుదురు పంచాయతీకి బదిలీ అయినా ఉన్నతాధికారుల సహకారంతో డెప్యూటేషన్‌ వేయించుకుని ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారంటే ఏ మేరకు వసూళ్ల పర్వం జరుగుతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏటా ఉన్నతాధికారులకు డబ్బులు ముట్టజెప్పడంతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుమారుడికి కూడా నెలసరి వాటాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ పరిధిలో ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ప్లాన్‌ అప్రూవల్‌ కోసం రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వీరికి చెల్లించకుండా అనుమతులు రావనేది అక్కడి ప్రజల వాదన.

పంచాయతీలో ఎవరైనా ముందుగా జూనియర్‌ అసిస్టెంట్‌ను కలిసి వారు అడిగిన సొమ్ము ముట్టజెప్పనిదే అక్కడ పని పూర్తికాదనేది అవనిగడ్డ ప్రజల వాదనగా వినపడుతోంది. ఈ జూనియర్‌ అసిస్టెంట్‌కు రెండేళ్ల క్రితం పదోన్నతి వచ్చినప్పటికీ వద్దని లేఖ కూడా అధికారులకు రాసి ఇచ్చారంటే ఏ విధంగా ఇక్కడకు విధులకు, వసూళ్ల పర్వానికి అంకితమైపోయారో తెలుస్తోంది. ఏదైనా ధ్రువీకరణ పత్రాల కోసం వెళితే ఉచితంగా ఇవ్వాల్సింది పోయి రూ. 500 ఇవ్వనిదే ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా వసూళ్ల పర్వాన్ని పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వీరిని తరచూ ప్రశ్నిస్తున్నారని అడ్డుతొలగించేందుకు కావాలనే ఇటీవల ఏసీబీ దాడి కూడా చేయించినట్లు తెలుస్తోంది. 20 వార్డులు ఉన్న అతి పెద్ద ఈ పంచాయతీలో వీరిద్దరూ చేస్తున్న వసూళ్ల పర్వానికి ఉన్నతాధికారులు ఇప్పటికై నా విచారణ చేసి వారికి అడ్డుకట్ట వేయాలని అవనిగడ్డ ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement