విజయవాడ కల్చరల్: ఆకాశవాణి (ప్రసార భారతి) 90 వసంతాల వేడుకలను తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వృత్తిరిత్యా వైద్యరంగంలో ఉన్నా కర్నాటక సంగీతంలో విశేష కీర్తిని సొంతం చేసుకున్న సర్వేపల్లి సోదరీమణులు శ్రేయ, రాజ్యలక్ష్మి నిర్వహించిన గాత్ర కచేరి శృతి లయ సమ్మేళనంగా సాగింది. కొలువుమరేగద, బ్రహ్మమొక్కటే, సిద్ధి వినాయకం, రామచంద్రం భావయామి, కీర్తనలను ఆలపించారు. వీరికి రమ్యకిరణ్మయి వయోలిన్‌పై, అరవింద్ మృదంగంపై, జి.వెంకటేష్ మోర్సింగ్ పై సహకరించారు. జానపద కళారూపమైన గరగ నృత్యాలను పసుపులేటి అయ్యప్ప బృందం ప్రదర్శించింది. ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన సంగీత, సాహిత్య, నృత్య, వ్యాస రచనల పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ఆకాశవాణి అధికారులు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ముఖ్య అతిథి ఆకాశవాణి డీడీ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి కేంద్రం 90 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై పనిచేస్తోందన్నారు. సంగీత, సాహిత్యం, నాటకాలతో ప్రతిభ కలిగిన వారికి అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రోగ్రామ్ హెడ్ దివ్య గుడిపూడి ఆకాశవాణి భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షుడు శరత్‌శ్చంద్ర, ఆకాశవాణి అధికారులు పలువురు పాల్గొన్నారు. లాకాశవాణిలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, కార్యక్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు. చింతా వెంకట్ బృందం పలు సంప్రదాయ కీర్తనలకు నృత్యాలను అభినయించారు.
అంగరంగ వైభవంగా ఆకాశవాణి
90 వసంతాల వేడుకలు


