ముగ్గురు యువకులకు కత్తిపోట్లు | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువకులకు కత్తిపోట్లు

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

ముగ్గురు యువకులకు కత్తిపోట్లు ఆటో బోల్తా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు ప్రమాదంలో గాయపడి మృత్యువాత

పెనమలూరు: మండలంలోని ణుకూరు గ్రామంలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. వణుకూరు గ్రామంలో శనివారం రాత్రి కుంతీమాత ఆలయం వద్ద కొక్కిలిగడ్డ అభిషేక్‌(19) తన స్నేహితులు పెనుమూడి పవన్‌కుమార్‌(19), కోవలి అభిషేక్‌(19)తో కలిసి బైక్‌పై గోసాలకు బయలుదేరారు. అదే గ్రామానికి చెందిన మంజిత్‌కుమార్‌ పాతకక్షల కారణంగా వారిని అడ్డుకున్నాడు. దీంతో వీరి మధ్య గొడవ మొదలయింది. మంజిత్‌కుమార్‌ కత్తితో కొక్కిలిగడ్డ అభిషేక్‌, పవన్‌కుమార్‌, కోవలి అభిషేక్‌పై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కత్తితో వారిని పొడిచాడు. స్థానికులు అడ్డుకోవటంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. మంజిత్‌కుమార్‌కు నేర చరిత్ర ఉంది. గాయపడిన ముగ్గురిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

గన్నవరం: మండలంలోని చిన్నఅవుటపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. విజయ వాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆటో చినఅవుటపల్లిలోని పిన్నమనేసి సిద్ధార్థ వైద్య కళాశాల వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అవనిగడ్డ: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామచంద్రపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి విజయవాడలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. మోపిదేవి మండలం చిర్లపాలెంనకు చెందిన వంగలపాటి వెంకటేశ్వరరావు(37) కోడూరు శివారు ఐబీపేటలో శనివారం వంట చేసేందుకు వెళ్లాడు. అనంతరం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా, రామచంద్రపురం దివిసీమ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అడ్డు వచ్చాడు. అతడిని తప్పించబోయి అదుపు తప్పి బైక్‌ పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వెంకటేశ్వరరావు తలకు బలమైన గాయాల య్యాయి. అతడిని హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement