పెనుగంచిప్రోలు: మండల పరిధిలోని తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేక లారీని వెనుకగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు వెనుకగా వస్తున్న ఓ కారు కూడా అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అయితే కారులో ఉన్న వారు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు


